Sivakarthikeyan | ‘దేశభక్తి సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ని మేళవించడం అంత సులభం కాదు. ఈ విషయంలో దర్శకుడు రాజ్‌కుమార్ అద్భుతమై వర్క్ చేశాడు. నేను సాయిపల్లవి నటన, డ్యాన్స్‌కు పెద్ద అభిమానిని. ఆమెతో ఒక సినిమాలో డ్యాన్స్ చేయాలన్నదే నా కోరిక. ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నా’ అన్నారు హీరో నితిన్. బుధవారం జరిగిన ‘అమరన్’ చిత్ర సక్సెస్మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ‘అమరన్’ చిత్రాన్ని తెలుగులో నితిన్ ఫాదర్ ఎన్.సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.
సాయిపల్లవి మాట్లాడుతూ ‘నేను పోషించిన భానుమతి, వెన్నెల..ఇలా ప్రతీ పాత్రతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ‘అమరన్’లో ఇందు పాత్రను కూడా అదే స్థాయిలో ఆదరిస్తున్నారు’ అని చెప్పింది. ఈ వేడుకలో హీరో శివకార్తికేయన్ తన తండ్రిని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ‘మా నాన్న నిజాయతీ గల పోలీస్ అధికారి. అమరన్ పాత్రలో ఆయన్ని చూసుకున్నా. నా మొదటి హీరో నాన్ననే. నాకు 17 ఏండ్ల వయసులో నాన్న మరణించారు. గత 21 ఏండ్లుగా ఆయన జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నా’ అని చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే తెలుగులో ఇరవై కోట్ల వసూళ్లను దాటిందని నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు.