Adi Saikumar | సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకులు, నిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అలాంటి సన్నివేశాల కోసం హీరోలు సైతం శారీరకంగా ఎంతో శ్రమిస్తున్నారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా షూటింగ్ సమయంలో అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ‘శంబాల’ సినిమా చిత్రీకరణలో ప్రమాదం జరిగినట్లుగా చిత్రబృందం పేర్కొంది. శంబాల షూటింగ్లో భాగంగా నిర్వహించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సమయంలో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. రాత్రివేళ జరిగిన ఈ సన్నివేశంలో పలువురు నటీనటులు పాల్గొన్నారు. గాయాలు అయినప్పటికీ ఆది షూటింగ్‌ను నిలిపివేయకుండా అదే రాత్రి పని పూర్తి చేసినట్లు పేర్కొంది.
సినిమా విషయంలో నిబద్ధతను చూపించిన ఆది చిత్రబృందం ప్రశంసలతో ముంచెత్తింది. ఇదిలా ఉండగా.. శంబాల మూవీ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి టాక్ నడుస్తున్నది. విడుదలకు ముందే అన్ని బిజినెస్ లావాదేవీలు పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్మాతలకు లాభాలు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఓటీటీ, శాటిలైట్ హక్కులు సైతం వేగంగా అమ్ముడయ్యాయి. నైజాంలో మైత్రి మూవీస్, ఆంధ్ర-సీడెడ్‌లో ఉషా పిక్చర్స్ మూవీని విడుదల చేయనున్నాయి. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానున్నది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.