తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా ఈ ఎన్నికలపై అగ్ర నటుడు చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘మా’లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు చిరంజీవి ఓ లేఖ రాశారు. ఇందులో ‘మా’ ఎన్నికలు వెంటనే జరపాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఆలస్యమైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయన్నారు. “ప్రతి రెండేళ్లకు మార్చిలో నిర్వహించాల్సిన ఎన్నికలు ఈ సారి కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. ప్రస్తుత కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేసుకోవాలి. జాప్యం లేకుండా ‘మా’ ఎన్నికలు వెంటనే జరగాలి. ఇటీవల ‘మా’ సభ్యులు కొందరు మీడియా ముందుకు వెళ్లి తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తంచేయడం వల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని కట్టడిచేయాలి. ఎవరికైనా అభిప్రాయభేదాలు, మనస్పర్థలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్పితే బహిరంగంగా విమర్శలు చేయడం మంచిది కాదన్నది నా అభిప్రాయం’ అని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు.