మనీషా కొయిరాలకు సోనాక్షి సిన్హా క్షమాపణ చెప్పింది. వీరిద్దరూ కలిసి ‘హీరామండి’ వెబ్‌సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. అసలు సోనాక్షికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అనే విషయానికొస్తే.. ఇటీవల సోనాక్షి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ నా అభిమాన నటి మనీషా కొయిరాల.
తను అద్భుతమైన నటి. ‘హీరామండి’లో ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చింది. నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నా. రీసెంట్గా ఆ వెబ్‌సిరీస్ మొత్తం చూశాను. ఎందుకో మనీషాకు క్షమాపణ చెప్పాలనిపించింది. ఫోన్ చేసి చెప్పేశాను. కథానుగుణంగా కొన్ని సన్నివేశాల్లో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్ చూస్తుంటే, అసలు ‘ఆ సీన్స్ ఎలా చేయగలిగానా!’ అనిపించింది.
అందుకే సారీ చెప్పా. షూటింగ్లో ఆమెతో గడిపిన క్షణాలు మరిచిపోలేను. మళ్లీ తనతో నటించే రోజుకోసం ఎదురుచూస్తున్నా. ముఖ్యంగా ‘హీరామండి’లో ఇంత గొప్ప పాత్ర ఇచ్చినందుకు సంజయ్‌లీలా భన్సాలీకి థ్యాంక్స్’ అని తెలిపింది సోనాక్షి. వేశ్యల జీవితాల నేపథ్యంలో రూపొందిన ‘హీరామండి’లో సోనాక్షి ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. పైగా ఆమె పోషించిన రెండు పాత్రలు నెగెటివ్ ఛాయలున్న పాత్రలు కావడం విశేషం.