తెలుగు సినీరంగంలో ఇటీవల తలెత్తిన థియేటర్ల సమస్యకు ఇండస్ట్రీలోని ఆ నలుగురే కారణమని అన్నారు టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్. వాళ్లు థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని, ఎఫ్డీసీ అధికారాలను దిల్ రాజు దుర్వినియోగం చేశారని, గద్దర్ అవార్డ్స్‌లో తెలంగాణ కళాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడారు. 2002 వరకు థియేటర్స్‌లో పర్సంటేజీ వ్యవస్థ ఉండేదని, ఆ తర్వాత సురేష్‌బాబు, అల్లు అరవింద్, దిల్‌రాజు, ఏషియన్ సునీల్‌లాంటి వారు థియేటర్స్‌ను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారని ఆర్.కె.గౌడ్ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తెలుగు రాష్ర్టాల్లో 1500 థియేటర్లలో 300 థియేటర్లను మాత్రమే ఓనర్స్ నడుపుతున్నారు. మిగతావన్నీ లీజ్ పద్దతిలో రెంట్ మీద నడుస్తున్నాయి. పర్సంటేజీ సిస్టమ్ కోసం గతంలో మేము నిరాహారదీక్ష చేశాం. ఏపీలో థియేటర్ల వ్యవస్థ ప్రక్షాళనకు పవన్‌కల్యాణ్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాం. తెలంగాణలో కూడా సినిమాటోగ్రఫీ మంత్రి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలి’ అన్నారు.
గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ ‘తెలంగాణ అవార్డ్స్ జ్యూరీకి మురళీమోహన్, జయసుధను ఛైర్మన్‌గా పెట్టడం ఏమిటో అర్థం కాలేదు. తెలంగాణ అవార్డ్స్‌లో తెలంగాణ వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దిల్‌రాజు తనవాళ్లకే అవార్డులను ఇచ్చుకున్నారు. థియేటర్ల బంద్ ఇష్యూలో కూడా ఆయన ప్రమేయం ఉంది’ అని ఆర్.కె.గౌడ్ అన్నారు. ఇందులో టీఎఫ్‌సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయుడు, రైటర్స్ యూనియన్ అధ్యక్షుడు అమృత్ గౌడ్ పాల్గొన్నారు.