Harsha Vardhan | తెలుగు ప్రేక్షకులకు నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా అమృతం సీరియల్లో గుండు హనుమంతరావుతో కలిసి చేసిన కామెడీతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సీరియల్లోని హర్షవర్ధన్ కామెడీ టైమింగ్ ఇప్పటికీ ప్రేక్షకులకి గుర్తుండిపోయింది. అలాగే శాంతి నివాసం, కస్తూరి వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు.సీరియల్స్‌తో పాటు వెండితెరపై కూడా తనదైన ముద్ర వేసిన హర్షవర్ధన్… కొండవీటి సింహాసనం, ఐతే, అనుకోకుండా ఒక రోజు, రాఖీ, స్టాలిన్, లక్ష్మీ కల్యాణం, లీడర్, పౌర్ణమి, గోల్కొండ హైస్కూల్, గబ్బర్ సింగ్, గోవిందుడు అందరి వాడేలే, ఊపిరి, బ్రోచేవారెవరురా, జాంబిరెడ్డి, ఏక్ మినీ కథ, పుష్పక విమానం, హిట్ ది సెకండ్ కేస్, సుందరం మాస్టర్, సరిపోదా శనివారం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, కోర్టు, పరదా వంటి అనేక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మధ్యలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ సహాయక నటుడిగా వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా విజయం నేపథ్యంలో హర్షవర్ధన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి మాత్రమే కాకుండా… మందుబాబులకు ఉపయోగపడే ఓ ముఖ్యమైన ఆరోగ్య సలహాను కూడా పంచుకున్నారు.మద్యపానం చేసే వారికి హర్షవర్ధన్ ఇచ్చిన సూచన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“ఒక పెగ్గు మద్యం తాగిన తర్వాత కచ్చితంగా ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. ఇలా ప్రతి పెగ్గుకు నీళ్లు తాగితే శరీరంపై మద్యం ప్రభావం కొంతవరకు తగ్గుతుంది” అని ఆయన తెలిపారు. ఈ అలవాటు తనకు నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిందని చెప్పారు. డ్రింక్ చేయడానికి ముందు ఆయన అర లీటర్ నీళ్లు తాగుతారని, అలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చని సుధాకర్ రెడ్డి తనకు చెప్పినట్లు హర్షవర్ధన్ వెల్లడించారు.మందుబాబులకు హర్షవర్ధన్ ఇచ్చిన ఈ సింపుల్ హెల్త్ టిప్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ… “డ్రింక్ చేసినా హెల్త్ జాగ్రత్తలు తప్పనిసరి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. నటుడిగా మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన వ్యక్తిగా కూడా హర్షవర్ధన్ మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు.