హరికథ
డిస్నీ+ హాట్‌స్టార్: డిసెంబర్ 13
తారాగణం: రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, అర్జున్ అంబటి, దివీ, పూజిత పొన్నాడ తదితరులు
దర్శకత్వం: మ్యాగీ
OTT Hit | పురాణాలు.. ఇతిహాసాలు.. దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎత్తడం.. దుర్మార్గుల ఆట కట్టించడం.. లోకానికి మేలు చేయడం ఇతివృత్తంగా ఎన్నో కథలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్‌లూ అదేబాట పడుతున్నాయి. దశావతారాల నేపథ్యంలో.. దుష్ట శిక్షణే లక్ష్యంగా డిస్నీ+ హాట్స్టార్లోకి వచ్చిన తెలుగు వెబ్ సిరీస్.. హరికథ.
1980 దశకం నేపథ్యంలో ‘అరకు’ పరిసర ప్రాంతాల్లో నడుస్తుందీ కథ. అక్కడ రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) బృందం నాటకాలు వేస్తూ ఉంటుంది. దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కోరోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శిస్తుంటుంది. అయితే.. రంగాచారి ఏ అవతారం గురించి నాటకాన్ని ప్రదర్శిస్తాడో.. ఆ అవతారం చేతిలో ఆ ఊరికి చెందిన ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు. అలా.. ఊరి వ్యక్తులు దారుణ హత్యలకు గురవుతుండటం.. అందరిలోనూ భయాన్ని కలిగిస్తుంది. ఒకనాడు నృసింహ అవతారం ఒకర్ని చంపుతుండగా.. ఒక వ్యక్తి చూస్తాడు. దాంతో, భగవంతుడే దుష్టులను శిక్షిస్తున్నాడంటూ జనంలో ప్రచారం మొదలవుతుంది.
మరోవైపు.. విరాట్ (శ్రీరామ్), భరత్ (అర్జున్ అంబటి) ఇద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లు. భార్యను కోల్పోయి, కూతురుతో కలిసి భరత్ దగ్గరికి వస్తాడు విరాట్. ఒకరోజు భరత్ కూడా హత్యకు గురికావడంతో.. ఆ హత్యతోపాటు అంతకుముందు జరిగిన హత్యల గురించీ ఆరా తీస్తాడు విరాట్. రంగాచారి వేస్తున్న నాటకాలకు.. ఈ హత్యలకు ఏదో సంబంధం ఉందని అనుమానిస్తాడు. అసలు రంగాచారి నేపథ్యం ఏమిటి? హత్యకు గురవుతున్న వాళ్లంతా అంతకుముందు ఏం చేశారు? అనే విషయాలు తెలియాలంటే.. ‘హరికథ’ను వీక్షించాల్సిందే!