పవన్‌కల్యాణ్ కెరీర్లో తొలి ఫోక్లర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఇందులో ఆయన రాబిన్‌హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నారు. ఉన్నవాళ్లను కొట్టి.. లేనివాళ్లకు పెట్టే ధీరోదాత్తుడిగా ఇందులో పవన్‌కల్యాణ్ కనిపిస్తారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ పానిండియా ప్రాజెక్ట్‌లోని కొంత భాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకు దర్శకుడు జ్యోతికృష్ణ. ఏళ్ల తరబడి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు విడుదల అవుతుందా? అని పవన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 28నే విడుదల కావాలి. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల రిలీజ్ డేట్‌ని మే 9కి వాయిదా వేశారు. ఇదిలావుంటే.. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఖమ్మంలో ప్రారంభమైనట్టు చిత్రవర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ షూటింగ్లో పవన్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సివుంది. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి కానున్నదట. దీంతో పోస్ట్‌ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేశారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, నోరా ఫతేహి, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి. మెగా సూర్యమూవీస్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతున్నది.