Hanuman | పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన “హనుమాన్” సినిమా విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. కానీ ఆ విజయమే ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీస్తోంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి (ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్) మధ్య తీవ్ర ఆర్థిక విభేదాలు తలెత్తాయి. ఈ వివాదం ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ మెట్లెక్కింది. తాజా సమాచారం ప్రకారం, నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిల్మ్ ఛాంబర్‌కు కంప్లైంట్ సమర్పించినట్టు తెలుస్తోంది. ఆ ఫిర్యాదు ప్రకారం, దర్శకుడు ప్రశాంత్ వర్మ తన “సినిమాటిక్ యూనివర్స్”లో భాగంగా ఉన్న “అధీర”, “జై హనుమాన్” వంటి సినిమాల కోసం రూ.10.23 కోట్లకు పైగా అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ ఆ ప్రాజెక్టులు తమ సంస్థలోనే చేయాలనే ఒప్పందాన్ని ఇప్పుడు వర్మ ఉల్లంఘించారని ఆరోపించారు.
అంతేకాదు, వర్మ డైరెక్షన్లో ఆగిపోయిన “ఆక్టోపస్” సినిమా విషయంలో కూడా నిర్మాత ఆరోపణలు చేశారు. “ఆ సినిమా కోసం వర్మ మమ్మల్ని వేరే ప్రొడ్యూసర్ నుంచి హక్కులు కొనిపించాడు, భారీ ఖర్చులు పెట్టించాక NOC ఇవ్వలేదు” అని నిరంజన్ రెడ్డి తన కంప్లైంట్లో పేర్కొన్నారు. దీనివల్ల తాము భారీగా నష్టపోయామని, ముఖ్యంగా “జై హనుమాన్” ప్రాజెక్ట్ వల్లే సుమారు రూ.100 కోట్లు, మొత్తం రూ.200 కోట్ల వరకు వ్యాపార నష్టం జరిగిందని పేర్కొంటూ, ఆ మొత్తాన్ని వర్మ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఘాటుగా స్పందించారు. తాను తీసుకున్నది ఎలాంటి అడ్వాన్స్ కాదని, అది “హనుమాన్” సినిమా లాభాల్లో తనకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా మాత్రమేనని స్పష్టం చేశారు.“నా దగ్గరికి వచ్చిన మొత్తం కేవలం రూ.15.82 కోట్లు మాత్రమే. అది నేను దర్శకత్వం వహించినందుకు ఇచ్చిన ఫీ, లాభాల వాటా . భవిష్యత్ సినిమాల కోసం ఎలాంటి ఒప్పందాలు లేవు. ఆక్టోపస్ సినిమా వ్యవహారానికి నాకు సంబంధం లేదు. ఆ విషయం నిర్మాత నిరంజన్ రెడ్డి, పాత ప్రొడ్యూసర్ మధ్యే ఉంది,” అని ప్రశాంత్ వర్మ తెలిపారు. నాకు రావాల్సిన డబ్బులు చెల్లించకుండా తప్పించుకునేందుకే నిర్మాత ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నా ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయి అని అన్నారు. ఇరువురి మధ్య మధ్యవర్తిత్వం జరగకపోతే, విషయం కోర్టుల దాకా వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఒకవైపు “జై హనుమాన్” వంటి ప్రాజెక్టు కోసం అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో దర్శకుడు–నిర్మాత మధ్య ఈ ఘర్షణ టాలీవుడ్లో కొత్త సంక్షోభానికి నాంది పలికింది.