Hanuman | తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతికి ఇప్పటి వరకు మరే సినిమాకు రాని కలెక్షన్స్ హనుమాన్ సినిమాకు వచ్చాయి. విడుదలకు ముందు ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరితే అద్భుతం అనుకున్నారు. ఆ తర్వాత దీని మీద ఉన్న అంచనాలు.. జరుగుతున్న చర్చ చూసిన తర్వాత 100 కోట్లు వసూలు చేస్తుందేమో అని ఒక అంచనా వేశారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా 300 కోట్ల వైపు పరుగులు పెడుతుంది హనుమాన్ సినిమా. కలలో కూడా ఊహించని లాభాలను ఈ సినిమా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన సినిమాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి.
ఆ మూడు రాజమౌళి నుంచి వచ్చినవే కావడం గమనార్హం. 2015లో విడుదలైన బాహుబలి దాదాపు 200 కోట్ల లాభాలు తీసుకొస్తే.. 2017లో విడుదలైన బాహుబలి 2 చరిత్రలో నిలిచిపోయేలా 500 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. ఇక ట్రిపుల్ ఆర్ కూడా దాదాపు 200 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. రాజమౌళి కాకుండా మరే ఇతర దర్శకుడు ఈ ఫీట్ అందుకోలేదు. తాజాగా ప్రశాంత్ వర్మ ఇది చేసి చూపించాడు. కేవలం 30 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్‌తో బరిలోకి దిగిన హనుమాన్ సినిమాకు ఇప్పటి వరకు 146 కోట్ల షేర్ వచ్చింది. అంటే దాదాపు 116 కోట్ల లాభం అన్నమాట. ఇంకా ఈ సినిమాకు కనీసం 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే సత్తా ఉంది. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ముందు అగ్రిమెంట్ చేసుకున్న నెల రోజుల కంటే.. మరో రెండు నెలలు అదనంగా పొడిగించుకున్నారు నిర్మాతలు.
మార్చి రెండో వారంలో ఈ సినిమా డిజిటల్ ప్రింట్ విడుదల కానుంది. అప్పటివరకు కేవలం థియేటర్లలోనే హనుమాన్ సినిమాను చూడాలి. ఇదిలా ఉంటే ప్రేక్షకులకు తమ సినిమాను మరింత చేరువ చేయడానికి నాలుగో వారం నుంచి టికెట్ రేట్లు 112 రూపాయలు ఉండేలా చూసుకుంటున్నారు నిర్మాతలు. మల్టీప్లెక్స్‌లో 150 రూపాయలు.. సింగిల్ స్క్రీన్స్ లో 112 రూపాయలు టికెట్ పెట్టాలని వాళ్లు ఆలోచిస్తున్నారు. దీనివల్ల సినిమాకు వెళ్లాలనుకునే ఆడియన్స్ సంఖ్య మరింత పెరుగుతుంది. దానికి తోడు రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. ఈరోజుల్లో ఒక సినిమాను రెండోసారి చూడాలి అనుకున్న టికెట్ రేట్ భయపడి బయటకు రావడం లేదు ప్రేక్షకులు. అందుకే హనుమాన్ సినిమాకు నామినల్ టికెట్ రేట్ పెట్టాలని చూస్తున్నారు. నాలుగో వారం మంచి ఇది అప్లై కానుంది.
ఇది కానీ వర్కౌట్ అయితే మరో 3 వారాలు కచ్చితంగా హనుమాన్ కు తిరుగుండదు. మొదటి నుంచి కూడా టికెట్ రేట్ల విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉన్నారు దర్శక నిర్మాతలు. ఓవర్సీస్లో కూడా కేవలం 12 డాలర్లు మాత్రమే పెట్టారు. ఈ రేట్ తోనే ఓవర్సీస్ లో ఏకంగా 5 మిలియన్ క్లబ్లో చేరింది ఈ సినిమా. అదే వాళ్లకు వాళ్ల సినిమాకు ఇన్ని వందల కోట్ల లాభాలు తీసుకొచ్చి పెట్టింది.