‘ఏ.. తయ్యతక్క తకధిమి చక్కభజనలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా.. ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చిమమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా.. నీ గొంతు కలిపి.. మా వంత పాడగ రావయ్య అంజనీ హనుమా.. రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జన్మ.. రామరామరామ రామరామ..’ శ్రీరాముడ్ని కీర్తిస్తూ ‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవి పాడిన పాట ఇది. ‘శ్రీరామనవమి’ ఉత్సవాలను ప్రతిబింబిస్తూ దర్శకుడు వశిష్ట ఈ పాటను తెరకెక్కించారు.
సీతారాముల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. హనుమంతుడి అదృష్టాన్ని కొనియాడుతూ భావోద్వేగభరితంగా రామజోగయ్యశాస్త్రి పాటను రచించగా, ఎం.ఎం.కీరవాణి జనరంజకంగా స్వరపరిచారు. శంకర్మహదేవన్, లిప్సిక భక్తితో ఆలపించారు. చిరంజీవి తన్మయంతో ఆడిపాడారు. భారీ సెట్టింగులతో ఆధ్యాత్మిక సంప్రదాయాల సారాన్ని ఆవిష్కరించేలా ఈ పాటను చిత్రీకరించడం జరిగిందని, చిరంజీవి చరిస్మాటిక్ ప్రెజన్స్.. గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులకు కన్నుల పండుగ చేయనున్నాయని, ఈ పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. త్రిష కృష్ణన్, అశికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.