Gv prakash -saindhavi | దక్షిణ భారత సినీ పరిశ్రమను షాక్కు గురిచేస్తూ, ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ – గాయని సైంధవి తమ 12 ఏళ్ల దాంపత్య బంధాన్ని అధికారికంగా ముగించారు. చెన్నై తొలి అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి సెల్వ సుందరి మంగళవారం (సెప్టెంబర్ 30) విడాకులు మంజూరు చేస్తూ తుది తీర్పును వెల్లడించారు. జీవీ ప్రకాశ్-సైంధవి జంట ముందు స్నేహితులు కాగా, అనంతరం ప్రేమికులుగా మారి 2013లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఒకరు సంగీతంతో, మరొకరు గానంతో ప్రేక్షకులని అలరించారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండగా, ఈ ఏడాది మార్చి 24న వీరు చెన్నై కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
చట్ట ప్రకారం ఇచ్చిన ఆరు నెలల గడువు అనంతరం కూడా తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా విడాకులే తమ నిర్ణయమని కోర్టులో స్పష్టం చేశారు. దీతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. విడాకుల ప్రక్రియలో, న్యాయమూర్తి “చిన్నారి ఎవరి వద్ద ఉంటుంది?” అనే ప్రశ్నకు జీవీ ప్రకాశ్ “తల్లి వద్దే ఉండటం మంచిదని సమాధానం ఇచ్చాడు. దీంతో 2020లో జన్మించిన కుమార్తెని తల్లి సైంధవే సంరక్షించుకోవాలని కోర్టు నిర్ణయించింది. ఈ వ్యవహారంలో ఇద్దరూ ఎంతో బాధ్యతగా, పరస్పర గౌరవంతో వ్యవహరించారని కోర్టు వర్గాలు తెలిపాయి. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడిగా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు పనిచేశాడు.
నటుడిగానూ ‘డార్లింగ్’, ‘త్రిష ఇల్లనా నయనతార’ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందాడు. సైంధవి ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆలపించి సంగీత ప్రియుల మనసులను గెలుచుకుంది. ఈ జంట విడిపోవడం సినీ వర్గాల్లో సెలెబ్రిటీ విడాకుల కొత్త చర్చకు తెరలేపింది. విడాకుల వార్తపై అభిమానులు తక్కువగా స్పందించినా, సోషల్ మీడియాలో వీరి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తూ మీ భవిష్యత్తు బాగుండాలి అంటూ మెసేజులు పోస్ట్ చేస్తున్నారు. అభిమానులు ముఖ్యంగా చిన్నారి భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇద్దరికీ జాగ్రత్తలు తెలియజేస్తున్నారు.