GV Prakash Kumar | ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్స్టన్’ (Kingston). ఈ సినిమాలో దివ్య భారతి (Divyabharathi) హీరోయిన్గా నటిస్తుండగా.. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 07న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ను చూస్తుంటే సముద్ర తీర గ్రామం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తుంది. తూత్తుకుడి సమీపంలోని సముద్రంలో ఒక ప్రదేశం శాపగ్రస్తమై ఉంటుంది. చేపలు పట్టడానికి అటు వెళ్లిన ప్రజలు అక్కడే మయమై పోవడం.. వారికోసం వెళ్లిన జనాలు కనిపించకుండా పోవడం జరుగుతుంది. అయితే దేవుడు అంటే నమ్మకం లేని కింగ్స్టన్ (జీవీ ప్రకాశ్ కుమార్) అసలు అక్కడ ఉన్న రహస్యం ఏంటి అని కనిపెట్టడానికి వెళతాడు. అయితే కింగ్స్టన్ అక్కడికి వెళ్లిన అనంతరం జరిగిన పరిస్థితులు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
జీవీ ప్రకాశ్ కుమార్, దివ్యభారతితో పాటు చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ & ప్యారాలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.