“గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ కోసం ఏడాదిన్నర పాటు టీమ్ అంతా కష్టపడ్డామని, ఇప్పుడిది ప్రతీ ఒక్కరి హృదయానికి దగ్గర కావడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత శరత్చంద్ర నాయుడు. విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన ఈ సిరీస్‌కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
చాలా ఏళ్ల తర్వాత మంచి సిరీస్ చూశామని అందరూ ప్రశంసిస్తున్నారని, అల్లు అర్జున్ సిరీస్ చూసి ట్వీట్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. తాను పాత్రల పరంగా కొత్తగా ప్రయత్నిస్తున్న ప్రతీసారి ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, ఈ సిరీస్ చూసి భావోద్వేగానికి గురయ్యామని చాలా మంది ఫోన్లు చేసి చెబుతున్నారని హీరో విరాజ్ అశ్విన్ అన్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలోని మధుర జ్ఞాపకాల్ని తట్టిలేపే సిరీస్ ఇదని దర్శకుడు వినోద్ గాలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ వైస్‌ప్రెసిడెంట్ సాయికృష్ణతో పాటు సిరీస్‌కు పనిచేసిన టీమ్ అంతా పాల్గొన్నారు.