OLA Electric Vehicle | వాహనానికి సర్వీస్ అందించడంలో కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వలన ఓ కస్టమర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తాను కొనుగోలు చేసిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకెళ్లి ఏకంగా షోరూమ్ ముందే నిప్పంటించి తగలబెట్టాడు. గుజరాత్‌లోని పాలన్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పాలన్పూర్కు చెందిన సాహిల్ కుమార్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. ఇటీవల అతడు తన భార్య కుమారుడితో కలిసి స్కూటీపై షాపింగ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో అకస్మాత్తుగా స్కూటీ స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. అదృష్టవశాత్తూ సాహిల్ నెమ్మదిగా వెళుతుండడంతో చిన్నపాటి గాయాలతో ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సాహిల్ కుమార్ తన కుటుంబ సభ్యులను వేరే వాహనంలో ఇంటికి పంపించి విరిగిపోయిన స్కూటీని నేరుగా ఓలా షోరూమ్‌కు తీసుకెళ్లాడు. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెంటనే రిపేర్ చేయాలని లేదా సురక్షితమైన ప్రత్యామ్నాయ వాహనాన్ని ఇవ్వాలని షోరూమ్ సిబ్బందిని కోరాడు.
అయితే సాహిల్ కుమార్ ఎన్నిసార్లు అడిగినా కంపెనీ సిబ్బంది సరిగ్గా స్పందించలేదు. రిపేర్ బాధ్యతను నిరాకరించి వాహనాన్ని మరో ప్రాంతంలోని సర్వీసింగ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దాదాపు లక్షన్నర విలువైన తన వాహనానికి జరిగిన లోపాన్ని దానివల్ల తమ కుటుంబానికి ఎదురైన ప్రమాదాన్ని సిబ్బంది పట్టించుకోకపోవడంపై అతడు తీవ్ర అసంతృప్తికి ఆగ్రహానికి లోనయ్యాడు. దీంతో కంపెనీ సర్వీసుపై విసిగిపోయిన సాహిల్ కుమార్ ఇక లాభం లేదనుకుని ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన నిరసనను వ్యక్తం చేస్తూ తాను కొనుగోలు చేసిన ఓలా షోరూమ్ ముందే తన ఓలా స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఘటన ఓలా వాహనదారులలో సర్వీస్ నాణ్యత, సాంకేతిక సమస్యలపై పెరుగుతున్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
షోరూమ్ ముందే ఓలా వాహనానికి నిప్పంటించిన కస్టమర్
స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని చెప్పినా కంపెనీ సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం
గుజరాత్–పాలన్పూర్ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా తన ఓలా వాహనం స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని షోరూముకు… pic.twitter.com/JFyax4IzWd
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025