Nayanthara | టాలీవుడ్‌కి చంద్రముఖి సినిమాతో పరిచయమైన తర్వాత, అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ లేడీ సూపర్‌స్టార్, ప్రస్తుతం తమిళం, హిందీ సహా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. గతేడాది షారుక్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకొని తన మార్కెట్‌ను పెంచుకుంది.
తాజాగా నయనతార తన సినీ జీవితంలో మైలురాయిని అందుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఒక ఎమోషనల్ నోట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మొదటిసారి కెమెరా ముందు వచ్చి నేటికి 22 ఏళ్లు. సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఎప్పుడూ ఊహించలేదు. తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చేశాయి. ధైర్యాన్ని ఇచ్చాయి. నన్ను నేను గా మార్చాయి. ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అంటూ నయన్ చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.
ఈ పోస్టు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. అభిమానులే కాకుండా, సినీ సెలబ్రిటీలు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నయనతార తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి “మన శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు .ఇది ఒక ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన “మీసాల పిల్లా” పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ హైప్‌ని బట్టి చూస్తే, సినిమా కూడా భారీ హిట్ అవుతుందన్న నమ్మకం టీమ్‌లో ఉంది.