Manchu Vishnu | ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్‌లోని ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప’ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మూవీకి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల విషయంలో తేడాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. జీఎస్టీ తనిఖీల నేపథ్యంలో మంచు విష్ణు, మోహన్‌బాబు ఇద్దరు కార్యాలయానికి చేరుకున్నారు. దాడులపై హీరో మంచు విష్ణును మీడియా ప్రశ్నించగా.. మీడియా చెప్పే వరకు ఈ విషయం తనకు తెలియది.. దాచి పెట్టేందుకు ఏమీ లేదన్నారు.
ఎక్కడెక్కడ అప్పులు చేశామో తనిఖీల్లో తెలుస్తుందని కదా? అని ప్రశ్నించారు. ‘కన్నప్ప’ మూవీపై స్పందింస్తూ.. ఇటీవల హిందీలో మూవీ ఫైనల్ కాపీ చూశానని.. మూవీ చివరి సన్నివేశాలు చాలామంది ప్రముఖులు ఎంతో అనుభూతిని పొందారని.. ప్రేక్షకులు సైతం ఇదే అనుభూతి పొందుతారని ఆశిస్తున్నానన్నారు. దేవుడు, భక్తుడికి మధ్య ఉండే కథ అని.. కన్నప్ప గురించి ఈ తరానికి తెలియజెప్పాలన్నదే తమ ఉద్దేశమని విష్ణు పేర్కొన్నారు. ముఖేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్‌బాబు, కాజల్ అగర్వాల్ సహా పలువురు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.