వంద సినిమాల మార్క్ అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు రవితేజ. ప్రస్తుతం ఆయన 75వ సినిమా షూటింగ్ జరుగుతున్నది. సితార ఎంటైర్టెన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడు. ఈ సినిమాకు ‘దావత్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తమిళ దర్శకుడు సి.సుందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఖుష్భూ నిర్మాతగా వ్యవహరిస్తారట.
సుందర్.సి గత కొన్నేళ్లుగా ఈ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. ఎట్టకేలకు రవితేజ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి రెడీ అయ్యిందని సమాచారం. ఇది రవితేజ 76వ చిత్రంగా రానున్నదని తెలుస్తున్నది. హారర్, థ్రిల్లర్ కామెడీ కథలను తెరకెక్కించి వైవిధ్యమైన దర్శకుడిగా సుందర్.సి పేరు తెచ్చుకున్నారు. మరి రవితేజతో ఆయన చేయబోయే సినిమా ఏ జానరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.