Govinda | బాలీవుడ్ కామెడీ కింగ్‌గా పేరొందిన గోవిందా ఎప్పుడూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారు. అయితే, ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం వార్తల్లోకి వచ్చింది. గోవిందా భార్య సునీత అహూజా తాజాగా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ సర్కిల్స్‌లో షాక్‌కు గురిచేశాయి. ఇటీవలి కాలంలో గోవిందా–సునీత జంట మధ్య విభేదాలు చెలరేగాయనే రూమర్స్ హిందీ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. కొందరు అయితే వీరిద్దరూ విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారని రాశారు. అయితే కుటుంబ సభ్యులు ఆ వార్తలను కొట్టి పారేశారు. “ఈ జన్మలో సునీత గోవిందా నుంచి విడిపోరు!” అని స్పష్టం చేశారు.
అయితే సునీత ఇటీవల పాడ్‌కాస్ట్‌లో గోవిందాపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ సంచలనంగా మారాయి. మరో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు. ఆయన అంత మంచి వాడు కాదు. ఎవరికైనా చిన్న వయసులో తప్పులు జరగొచ్చు, కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత కూడా అవే తప్పులు చేస్తే అర్థం కాదు. మీకు అందమైన భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు అలాంటి తప్పులు చేస్తారు?” అని ప్రశ్నించారు. గోవిందా తన జీవితంలో భార్యతో కంటే తన హీరోయిన్లతో ఎక్కువ సమయం గడిపాడు. నేను చిన్న వయసులో ఏమీ అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఈ 38 ఏళ్ల వైవాహిక జీవితం నన్ను చాలా నేర్పించింది. ఒక స్టార్ భార్య కావడానికి రాయిలా బలమైన మనసు కావాలి. కానీ నేను అప్పట్లో అంత బలంగా లేను” అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల క్రితం కూడా సునీత, తన భర్త చుట్టూ తిరిగే స్వామీజీలు, పండిట్లు, భజంత్రీలు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వాళ్లు లక్షల్లో కొట్టేస్తున్నారు. గోవిందా వాటిని నమ్ముతాడు. కానీ వాళ్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు” అని సునీత విమర్శించారు. గోవిందా, సునీత అహూజా 1987లో ప్రేమ వివాహం చేసుకున్నారు. టీనా పుట్టేవరకు ఈ పెళ్లిని రహస్యంగా ఉంచారు. చాలా సంవత్సరాలు వీరి జీవితం అందరికి ఆదర్శంగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ జంట మధ్య నెలకొన్న విబేధాలు చర్చనీయాంశంగా మారాయి. గోవిందా–సునీత మధ్య నిజంగా విభేదాలు ఉన్నాయా? లేక మీడియా కథనాలేనా? అన్న గందరగోళం సోషల్ మీడియాలో నెలకొంది. అయితే సునీత చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇద్దరి మధ్య “సైలెంట్ వార్” కొనసాగుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.