Govinda | సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహూజా విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు ఇటీవల మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బాంద్రా (ముంబయి)లోని కుటుంబ న్యాయస్థానంలో ఇప్పటికే వీరికి సంబంధించిన పంచాయతీ నడుస్తోందని హోటర్ ఫ్లై అనే పత్రిక తన కథనంలో పేర్కొంది. సునీత గోవిందాపై క్రూరత్వం, వ్యభిచారం, విడిచిపెట్టి ఉండటం వంటి ఆరోపణలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో కౌన్సిలింగ్ సెషన్లు కూడా జరుగుతున్నాయని, అయితే గోవిందా వాటికి హాజరుకాలేకపోతున్నారని, సునీత మాత్రం ప్రతి సెషన్‌కు హాజరవుతూ వస్తున్నారని కథనాలు చెబుతున్నాయి.
ఈ వార్తలని గోవిందా కుటుంబ స్నేహితుడు ప్రహ్లాద్ నిహలానీ మరియు ఆయన కుమార్తె టీనా అహూజా పూర్తిగా ఖండించారు. వినాయక చవితి సందర్భంగా గోవిందా మరియు సునీత కలిసి లార్డ్ గణేశుని దర్శించుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సునీతా అహూజా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ .. “మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. గణపతిని దర్శించుకోవడానికి వచ్చాము. మాకు విడాకులు అనే విషయంలో వాస్తవం లేదు” అని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా, ఆమె మాట్లాడుతుండగా గోవిందా నవ్వుతుండటం ఆసక్తికరంగా మారింది.
ఇది మొదటిసారి కాదు. గతంలో కాళికా దేవి ఆలయాన్ని సందర్శించిన సమయంలో సునీతా అహూజా విడాకుల పుకార్లను ఖండించారు. చిన్నప్పటి నుంచి ఆ ఆలయానికి వెళ్లే తన అనుభవాన్ని పూజారితో పంచుకుంటూ, భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. “గోవిందాను కలిసినప్పుడు, ఆయనతో నా వివాహం సంతోషంగా జరగాలని దేవుడిని ప్రార్థించాను. నా కోరికలను దేవత నెరవేర్చింది. ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చింది. కానీ జీవితంలో ప్రతీ సత్యాన్ని జీర్ణించుకోవడం సులభం కాదు. ఎప్పుడూ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయినప్పటికీ దేవతపై నాకు గాఢమైన నమ్మకం ఉంది. నన్ను, నా ఇంటిని విచ్ఛిన్నం చేయాలని ఎవరు ప్రయత్నించినా, కాళి మాత వారికి సమాధానం చెబుతుంది” అని ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు.గోవిందా–సునీత జంట ప్రేమ వివాహం ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే. 1987లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి టీనా అహూజా, యశవర్థన్ అహూజా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్వరలోనే యశవర్థన్ హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నాడు.