R Narayana murthy | తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన వ్యక్తిత్వం ఉన్న వారిలో ఆర్. నారాయణమూర్తి ఒకరు. నటుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ప్రజా సమస్యలను వెండితెరపై ప్రతిబింబించే దర్శకునిగా, నిర్మాతగా పరిణమించింది. సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయాన్ని తన సినిమాలలో చూపించి ప్రజలని చైతన్యవంతులుగా మార్చే ప్రయత్నం చేశారు ఈ ‘పీపుల్స్ స్టార్’, ఇప్పుడు మరో మానవీయ అంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’ . ఈ నెల ఆగస్టు 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.
పేపర్ లీక్ అంశం ద్వారా విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపేలా రూపొందిన ఈ చిత్రం, సమాజంలోని విద్యార్థుల ఆవేదనను తెరపై ఆవిష్కరించనుంది. తాను ఎంచుకునే ప్రతి కథ కూడా ఒక సామాజిక ఉద్యమమే అవుతుందన్న నమ్మకంతో నారాయణమూర్తి మరోసారి తన మార్క్ మెసేజ్ ఇవ్వనున్నారు.తాజాగా మూవీకి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో గోరటి వెంకన్న , అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందిని సిదారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీం తదితరులు పాల్గొని ఆర్.నారాయణమూర్తి గొప్పతనాన్ని కొనియాడారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ.. ఆర్. నారాయణమూర్తిని సినిమా రంగానికే కాకుండా సమాజానికీ గర్వకారణమైన వ్యక్తి గా అభివర్ణించారు.
“వెయ్యిమంది కాదు.. పదివేల మంది ఒక్కో లక్ష రూపాయులు ఇచ్చేంత ఫ్రెండ్స్ నారాయణ మూర్తికి ఉన్నారు. ఊర్లో రెండు కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి నాగం జనార్ధన్ రెడ్డి గారి పేరుతోతో ప్రజలకు అంకితం చేశారు ఆయన. దానికి ఆయన తన పేరు గానీ, తన తల్లిదండ్రుల పేరుకాని పెట్టుకోలేదు. అందరి కన్నా ముందు వారి ఊర్లో ఆయన నాన్నగారి కోరిక మేరకు ఆలయం కట్టించారు. కాని ఏ నాడు చెప్పుకోలేదు. తన స్వార్ధం గురించి ఆలోచించకుండా మా లాంటి వాళ్లని ముందుకు నడిపించాడు. పైకి సాధారణంగా కనిపించిన కూడా రాజకీయ అంశాలపై ఆయనకు చాలా పట్టు ఉంది.విప్లవ భావాలు కలిగినా ఏనాడు హింసను ప్రోత్సహించలేదు. హింసను ఇష్టపడే ఏ మనిషీ మనిషే కాడని చెబుతూనే.. ఈ వ్యవస్థలో మనుషులు అనివార్యంగా హింసకు ఎలా ప్రేరేపించబడతారో, హింసా రాజ్యం ఎలా ఉంటుందో తన సినిమాల్లో చూపించారు. సినీ ఇండస్ట్రీకొచ్చిన ఎందరో తమ భావాలను మార్చుకున్నా ఆర్.నారాయణమూర్తి మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు తన భావాలను, మార్గాన్ని మార్చుకోకుండా ఒకే పంథాలో వెళ్తున్నారు అని అన్నారు గోరేటి వెంకన్న.