‘శ్రీనువైట్లతో నాది రెండేళ్ల ప్రయాణం. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. ఇప్పటికి కుదిరింది. శ్రీనువైట్ల సినిమాలో ఆడియన్స్ ఎంత ఎంటైర్టెన్మెంట్ ఆశిస్తారో అంతా ఇందులో ఉంటుంది. అందుకోసమే దాదాపు ఏడు నెలలు స్క్రిప్ట్ మీద పనిచేశారాయన. శ్రీనువైట్ల మార్క్ ప్రతి ఆర్టిస్టులో కనిపిస్తుంది. ఆయనతో జర్నీ చాలా ఎంజాయ్ చేశా. ఆర్టిస్టును కంఫర్ట్జోన్లోకి తీసుకొచ్చి తనకు కావాల్సింది తీసుకుంటారాయన. నేను ఇంత కంఫర్ట్‌గా ఏ సినిమాకూ ఫీలవ్వలేదు. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని హాయిగా నవ్వించే సినిమా ఇది’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఆయన హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడారు. ‘ఈ సినిమాను అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను. దానికి కారణం నా రైటింగ్ టీమ్. అందరూ నాపై ప్రేమతో పనిచేశారు. రెండున్నర గంటల్లో ఒక్క సెకన్ కూడా సినిమా బోర్ కొట్టదు. సాంకేతికవర్గం, నటీనటవర్గం అందరూ ప్రాణం పెట్టి పనిచేసిన సినిమా ఇది’ అని శ్రీనువైట్ల చెప్పారు. అక్టోబర్ 11న అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కోరారు. ఇంకా మరోనిర్మాత వేణు దోనేపూడి, కథానాయిక కావ్యా థాపర్, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, డివోపీ కెవి గుహన్ తదితర చిత్ర యూనిట్‌తోపాటు దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, మహేశ్‌లు కూడా మాట్లాడారు.