గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖన్నా నాయికగా నటిస్తున్నది. జూలై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చిత్ర ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ…‘ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. సినిమా ఇంతకుమించి ఉంటుంది. గోపీచంద్‌ను బాగా చూపించాలని ప్రయత్నించాను. ఆయన కూడా చాలా శ్రద్ధ తీసుకుని నటించాడు. మీకు వినోదాన్ని పంచే చిత్రమవుతుంది’ అన్నారు. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ…‘గోపీచంద్ యాక్షన్, మారుతి తరహా వినోదాన్ని ఈ చిత్రంలో చూస్తారు. నేను చేసిన సినిమా పక్కా కమర్షియల్ అయినా నాన్ కమర్షియల్‌గా ఆలోచించా.
మీ అందరికీ సినిమా అందుబాటులో ఉండాలని టికెట్ రేట్లను తక్కువకే పెడుతున్నాం. మీలాంటి ప్రేక్షకులు ఉత్సాహమే సినిమాను బతికిస్తుంది’ అన్నారు. ‘మీ అభిమానమే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. పుట్టినరోజు అభిమానులను కలుసుకోవడం హ్యాపీగా ఉంది. ఇలా అందరితో కార్యక్రమం చేసుకుని చాలా రోజులైంది. దర్శకుడు మారుతి మంచి దర్శకుడే కాదు పాజిటివ్ వ్యక్తి. సినిమా ట్రైలర్ చూసి ఉంటారు..సినిమా విందు భోజనంలా ఉంటుంది. మిమ్మల్ని అలరించే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. అనేక నవ్వుకునే సన్నివేశాలు రూపొందించారు. మీరంతా పక్కాగా సినిమాను ఎంజాయ్ చేస్తారు’ అని హీరో గోపీచంద్ అన్నారు. హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ…‘ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సినిమా కూడా అలాగే వినోదాన్ని పంచుతుంది. ఈ సినిమాలో బాగా నవ్వించే పాత్రలో కనిపిస్తాను. మంచి కథ, పాత్రలు రాసిన దర్శకుడు మారుతికి థాంక్స్. థియేటర్లో సినిమాను ఆస్వాదించండి’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక సియా గౌతమ్, నటులు సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, నిర్మాత ఎస్కేఎన్ తదితరులు పాల్గొన్నారు.