Mirai | యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తేజ సజ్జ హీరోగా, రితికా నాయక్ హీరోయిన్గా నటించిన సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “మిరాయ్” సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లు రాబడుతూ, తేజ సజ్జ కెరీర్లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే, సినిమా విడుదల రోజున ప్రేక్షకులు ఓ విషయంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో సెన్సేషన్‌గా మారిన ‘వైబ్ ఉంది’ అనే పాట, చిత్రంలో ఎక్కడా కనిపించకపోవడం ఆ నిరాశకు కారణమైంది. యూత్‌లో దూసుకుపోయిన ఈ పాటను థియేటర్లో చూసేందుకు వచ్చినవారికి అది కనిపించకపోవడం కొంత డిజప్పాయింట్ చేసింది.
చివరికి ప్రేక్షకుల డిమాండ్‌కు తలొగ్గిన చిత్రబృందం, సెప్టెంబర్ 23 నుండి ‘వైబ్ ఉంది’ పాటను సినిమాలో ప్రత్యేకంగా కలిపి థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ పాటను స్క్రీన్ మీద చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ పాట థియేటర్లలో ప్రదర్శించబోతున్నట్టు తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఇంతకాలంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్సయ్యాం.. ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో చూసేస్తాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సైంటిఫిక్ యాక్షన్ మూవీ మిరాయ్ చిత్రంలో యంగ్ టాలెంటెట్ తేజా సజ్జా, రితికా నాయక్, సినీయర్ నటులు శ్రీయా శరణ్, మంచు మనోజ్, జగపతి బాబు, జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ టెక్నీషియన్లు సినిమాటోగ్రఫీ, దర్శకత్వం కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్ గౌర హరి, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ చూశారు. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని రూ.65 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు క్రాస్ చేయగా, రానున్న రోజులలో మరిన్ని రికార్డులు సాధించనుందని అంటున్నారు.