Acharya Trailer | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. దీనికోసం ఏడాదిన్నరగా మెగాభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. పాండమిక్ కారణంగా ఏడాదిగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. గత ఏడాది మే 13 న విడుదల కావాల్సిన ఆచార్య.. ఈ ఏడాది ఏప్రిల్ 29 న వస్తుంది. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు భరత్ అనే నేను తర్వాత నాలుగేళ్లుగా మరో సినిమా చేయని కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయింది.
ఏప్రిల్ 29న సినిమా విడుదల కావడం మాత్రమే తరువాయి. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు రామ్చరణ్కు జోడీగా పూజా హెగ్డే కనిపిస్తోంది. RRR సినిమాతో సంచలన విజయం అందుకున్న చరణ్.. నెల రోజుల గ్యాప్లోనే మరో సినిమాతో వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఆచార్య ట్రైలర్ ఏప్రిల్ 12న విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వచ్చింది. దాంతో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది ఆచార్య యూనిట్.
ఆచార్య సినిమాతో ఖచ్చితంగా మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించడం ఖాయం అని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు. మూడేళ్ల కింద వచ్చిన సైరా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కేవలం తెలుగులో మాత్రమే బాగా ఆడిన సైరా మిగిలిన అన్ని భాషల్లో డిజాస్టర్ అయ్యింది. ఆ బాకీ ఇప్పుడు ఆచార్య రూపంలో తీసుకోవాలని చూస్తున్నాడు మెగాస్టార్. నక్సలిజం బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా వస్తోంది. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరు నక్సలైట్స్ గా నటించడం గమనార్హం. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన తర్వాత కచ్చితంగా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు. విడుదలకు కేవలం 3 వారాల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచాలని చూస్తున్నారు ఆచార్య దర్శక నిర్మాతలు. మొత్తానికి చూడాలిక ట్రైలర్ ఎలా ఉండబోతుందో..!
‘హరిహర వీరమల్లు’ నుంచి పవన్ అభిమానులకు సూపర్ సర్ ప్రైజ్..
Puri Jagannadh | పూరీ కలను నెరవేర్చిన మెగాస్టార్.. ఇన్నేళ్ళకు ఛాన్స్ ఇచ్చిన చిరు
Balayya | ప్రముఖ సీనియర్ నటుడు ‘బాలయ్య’ కన్నుమూత