‘ఇందులో నేను ఇంట్రావర్ట్. పేరు సిద్ధు. చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. సెటిల్డ్‌గా పెర్ఫామ్ చేయాలి. తొలి సినిమాకే ఇంత మంచి పాత్ర దొరకడం అరుదు. అందుకే చాలెంజ్‌గా తీసుకుని చేశాను. ఇదొక భావోద్వేగ ప్రయాణం. ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచే సినిమా అవుతుంది’ అని యువహీరో కృష్ణవంశీ అన్నారు. ఆయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. మోక్ష కథానాయిక. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకుడు. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మాతలు. నేడు సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కృష్ణవంశీ విలేకరులతో ముచ్చటించారు. ‘మాది కడప. సినిమాలంటే పిచ్చి. ముఖ్యంగా బాలయ్య, తారక్, ప్రభాస్‌ల మాస్ సినిమాలంటే ఇంకా పిచ్చి.
ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూడాల్సిందే. కాలేజ్‌టైమ్‌లో షార్ట్ఫిలింస్ కూడా చేశా. ఇంజినీరింగ్ చేశా. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. సినిమాలకోసం వదిలేశా. వైజాగ్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టా. దర్శకుడు ఆకాశ్‌కి నా ఆడిషన్ నచ్చింది. ఈ అవకాశం నాకు దక్కింది. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచే మంచి కథను దర్శకుడు ఆకాశ్ రాసుకున్నారు. అంతే అద్భుతంగా తీశారు కూడా. హీరోయిన్ మోక్ష మంచి నటి. గొప్పగా నటించింది. సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు, సపోర్ట్ చేసిన దిల్‌రాజుగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు యువహీరో కృష్ణవంశీ.