Good Bad Ugly Blockbuster | తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది. 2025లో ఇప్పటివరకు విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ.210 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటివరకు ఈ రికార్డు డ్రాగన్ పేరు మీదా ఉండగా.. తాజాగా ఆ రికార్డును అధిగమించింది అజిత్ సినిమా. మరోవైపు కేవలం తమిళంలోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం.
‘మార్క్ ఆంటోనీ’ విజయం తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. అజిత్‌తో పాటు త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న, ప్రభు, యోగి బాబు, సునీల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కథ, స్క్రీన్‌ప్లే లేని చిత్రమంటూ విడుదల ముందు కొంత విమర్శలు వచ్చినప్పటికీ, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి తగ్గుదల లేకుండా హిట్‌గా నిలిచింది.
చాలా కాలం తర్వాత అజిత్ పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ చిత్రంలో నటించడంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్‌కు పండగలాంటిదని, అతని పాత సినిమాల సంభాషణలు, సన్నివేశాలను ప్రస్తావిస్తూ ఉత్సాహభరితంగా కనిపించిన అజిత్‌ను తెరపై చూడటం థ్రిల్లింగ్ అనుభవమని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
❤️🙏🏻 #GoodBadUglyBlockbuster ❤️🙏🏻 pic.twitter.com/ynscT1IIA6
— Adhik Ravichandran (@Adhikravi) April 15, 2025