అగ్ర నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంట్లో బంగారం చోరి జరిగింది. చెన్నైలోని తమ నివాసం నుంచి దాదాపు నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య చెన్నై తేనంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో తన సోదరి సౌందర్య వివాహం సందర్భంలో ఆ ఆభరణాల్ని ధరించానని, అప్పటి నుంచి వాటిని ఇంటిలోని లాకర్లో భద్రపరిచానని ఐశ్వర్య తన ఫిర్యాదులో తెలిపింది. చోరికి గురైన ఆభరణాల్లో బంగారు గాజులతో పాటు అరుదైన డైమండ్ సెట్స్ ఉన్నాయని చెప్పింది. ఈ చోరి విషయంలో ఇద్దరు పనిమనుషులతో పాటు తన డ్రైవర్‌పై అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొంది.
ప్రస్తుతం ఐశ్వర్య ‘లాల్ సలామ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది. రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్రికెట్, కమ్యూనిజమ్ నేపథ్యంలో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.