భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 50ఏండ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడంతోపాటు, నేటికీ అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నందుకు గాను తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణలకు ఘనమైన సత్కారం జరుగనున్నది. ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగనున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(IFFI) ప్రారంభ వేడుక ఈ సన్మానాలకు వేదిక కానున్నది. సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(NFDC), ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా(ESG) సంయుక్తంగా గోవా ప్రభుత్వంతో కలిసి ఈ వేడుకను నిర్వహించనున్నాయి.
1975లో కె.బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన రజనీకాంత్, దాదాపు 175పైచిలుకు చిత్రాల్లో నటించి తమిళనాట తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదితో ఆయన 50ఏండ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. భారతీయ సినిమాకు రజనీ చేసిన సేవలకు గాను, భారత ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. ఇటీవలే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును కూడా రజనీకాంత్ అందుకున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. తండ్రి ఎన్టీరామారావు నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ 50ఏండ్ల కెరీర్‌ను గత ఏడాదే పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. 100పైలుకు చిత్రాలలో నటించడంతోపాటు నేటికీ తెలుగుతెరపై వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. ఈ విజయాలను దృష్టిలో పెట్టుకొనే ఈ ఇరువురు ఉద్దండులనూ సత్కరిస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయమంత్రి ఎల్.మురుగన్ తాజాగా వెల్లడించారు.