మహేష్‌బాబు-రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన భారీ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరుగబోతున్న విషయం తెలిసిందే. ‘గ్లోబ్‌ట్రాటర్’ (ప్రపంచ విహారి) పేరుతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. కుంభ పాత్రలో ప్రతినాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, మందానికి పాత్రలో కథానాయిక ప్రియాంకచోప్రా లుక్స్‌కి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నేటి ఈవెంట్ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.
2027 మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. అంటే సినిమా రిలీజ్‌కు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నట్లు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ..సోషల్‌మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నది. నేటి ఈవెంట్లో సినిమా టైటిల్లో పాటు మహేష్‌బాబు ఫస్ట్‌లుక్‌ని రివీల్ చేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌పై అందరిలో ఆసక్తి పెరిగింది. దాదాపుగా ‘వారణాసి’ టైటిల్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయని, ‘గ్లోబ్‌ట్రాటర్’ ఉపశీర్షికలా ఉంటుందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో టైటిల్ సస్పెన్స్‌కు తెరపడనుంది. భారతీయ పురాణాలతో ముడిపడిన ఈ కథలో మహేష్‌బాబు సాహసయాత్రికుడి పాత్రలో కనిపించనున్నారు.