‘కోవిడ్ కారణంగా ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటున్న తరుణంలో అఖండ, పుష్ప, శ్యామ్‌సింగరాయ్ సినిమాలను నైజాంలో విడుదల చేస్తే..మూడు పెద్ద విజయం సాధించాయి. సినిమా పట్ల ప్రేమ ఉంటే ఇలాంటి విజయాలు ఎన్నో వస్తుంటాయి. పంపిణీదారుడిగా, నిర్మాతగా ఇలాంటి మ్యాజిక్ చూసినప్పుడు ఎనర్జీ వస్తుంది’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘శ్యామ్‌సింగరాయ్’ సక్సెస్‌మీట్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్సంకృత్యాన్ దర్శకుడు. సక్సెస్‌మీట్‌లో నాని మట్లాడుతూ ‘ఎలాంటి పరిస్థితులున్నా మంచి సినిమాను ఆదరిస్తామని ప్రేక్షకులు నిరూపించారు. మీ ప్రోత్సాహం ఉన్నంత వరకు ప్రాణం పెట్టి సినిమాల కోసం పనిచేస్తా. ఈ సినిమా విషయంలో దిల్‌రాజుగారి జడ్జిమెంట్ నిజమైంది. ‘సఖి’ వంటి సినిమాలు చూసినప్పుడు అలా ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమకథ చేయాలనిపిస్తుంది. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది’ అన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందని నిర్మాత వెంకట్ బోయనపల్లి తెలిపారు. సాయిపల్లవి మాట్లాడుతూ ‘థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా కోసం మంచి పాత్రను సృష్టించిన దర్శకరచయితలకు కృతజ్ఞతలు. నాని ప్రతి సినిమాను తొలి సినిమాగానే భావిస్తుంటారు. ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది. రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ ‘రాయి రాయి కలిపి ఓ గుడి నిర్మించినట్లు ఈ సినిమా కోసం శ్రమించాం. ఈ సినిమాను అందరూ క్లాసిక్ అంటూ అభివర్ణిస్తున్నారు. కథ, సంగీతం, సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఉండటం వల్లే ఇంతటి ఆదరణ దక్కింది’ అన్నారు. ఈ సినిమాలో తనను కొత్త కోణంలో ఆవిష్కరించారని కృతిశెట్టి చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఏపీ సీఎంతో చర్చలు జరపండి: నారాయణమూర్తి
‘ఆంధ్రప్రదేశ్‌లో చాలా థియేటర్లు మూసివేస్తున్నారని తెలుసుకొని బాధపడ్డా. సినిమా తీసేవారు, చూపించేవారు, చూసేవారు..ఈ ముగ్గురు బాగుంటేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధిస్తుంది’ అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి. సోమవారం జరిగిన ‘శ్యామ్‌సింగరాయ్’ విజయోత్సవ వేడుకలో ఆయన సినిమారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమ మీద ఆధారపడి లక్షలమంది బతుకుతున్నారు. కాబట్టి పరిశ్రమ శ్రేయస్సు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. థియేటర్ ఓనర్లు థియేటర్స్‌ను మూసివేయకుండా స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల్ని కలిసి తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. సినిమావాళ్లు ప్రభుత్వంతో పాజిటివ్ ధోరణితో వ్యవహరించాలి. ఎవరూ అనవసరమైన భావోద్వేగాలకు లోనుకాకుండా థియేటర్ వ్యవస్థను కాపాడుకోవాలి. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చిత్ర పరిశ్రమ పెద్దలతో సమస్యల గురించి చర్చించాలని, అన్ని థియేటర్లు తెరచుకునేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అన్నారు.