‘సినీ పరిశ్రమ అంటే అమ్మాయిలు భయపడతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. బిందాస్‌గా రావొచ్చు. ఏది కూడా సులభంగా మన దగ్గరకు రాదు’ అన్నారు కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యానీ మాస్టర్ మాట్లాడుతూ ‘తెలుగు సినీ పరిశ్రమకు లేడీ డ్యాన్సర్లు, లేడీ కొరియోగ్రాఫర్లు కావాలి. మీరు టాలెంటెడ్ అయితే మంచి భవిష్యత్ ఉంటుంది’ అన్నారు.‘తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్సర్ల కొరత ఉందని, ప్రతిభ వున్న వాళ్లంతా వచ్చి ఆడిషన్ ఇవ్వాలని డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్. చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్‌కుమార్ కూడా పాల్గొన్నారు.