ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్
డిస్నీ+ హాట్ స్టార్ : సెప్టెంబర్ 20
తారాగణం: ఆశుతోష్ రాణా, భానుచందర్, నందు, తేజస్వి తదితరులు
దర్శకత్వం : అనీశ్ కురువిల్లా
టాలీవుడ్ హిస్టరీ తెరిస్తే.. మిస్టరీ సినిమాలు చాలానే కనిపిస్తాయి. అప్పుడెప్పుడో వచ్చిన ‘అవే కళ్లు’తో మొదలుపెడితే.. ఈ లిస్ట్‌కు ఎక్కిన ‘హిట్’ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఫట్ మనిపించినా.. సగటు ప్రేక్షకుడికి థ్రిల్‌ను మాత్రం పంచాయి. అందుకే, ‘థ్రిల్లర్ జానర్’ అంటేనే.. ‘ఎవర్గ్రీన్’ అన్నట్టుగా మారింది. ప్రస్తుతం ‘డిస్నీ+ హాట్ స్టార్’ వేదికగా వచ్చిన ‘ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ కూడా అదేబాటలో నడుస్తున్నది. ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈనెల 20న విడుదలై.. రికార్డ్ స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది.
కథలోకి వెళ్తే.. విశ్వక్సేన్ (ఆశుతోష్ రాణా) ఓ శాస్త్రవేత్త. జనజీవనానికి దూరంగా ‘మోక్ష ఐలాండ్’లో ఉంటూ.. పరిశోధనలు చేస్తుంటాడు. రూ. 24వేల కోట్ల ఆస్తిని కూడబెట్టి చనిపోతాడు. తాము విశ్వక్సేన్ వారసులమని ఉత్తరాల ద్వారా తెలుసుకున్న కొందరు.. మోక్ష ఐలాండ్‌కు చేరుకుంటారు. వారిలో ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధమూ ఉండదు. అయితే, ఎవరైతే ఆ ఐలాండ్‌లో వారం రోజులు గడుపుతారో.. వారికే తన ఆస్తిని ఇవ్వాలని విశ్వక్సేన్ తన వీలునామాలో రాస్తాడు.
కానీ, ఐలాండ్ వచ్చినవారిలో ఒక్కొక్కరూ మాయమవుతూ.. ఆ చుట్టుపక్కల శవాలుగా కనిపిస్తుంటారు. ఆ మిస్టరీ హత్యలను చూసి.. మిగిలిన వాళ్లంతా భయపడిపోతారు. అయినా.. ఆస్తి కోసం అక్కడే ఉంటారు. ఇంతకూ ఆ హత్యలు చేస్తున్నది ఎవరు? అందరూ విశ్వక్సేన్ వారసులే అయితే, ఒకరి గురించి మరొకరికి ఎందుకు తెలియదు? చివరికి ఆ ద్వీపం నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అనేది మిగతా కథ. దర్శకుడు ఓ ఆసక్తికరమైన సబ్జెక్ట్‌ను ఎంచుకొని, అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఎంతో స్టడీ చేసి.. మిస్టరీని పకడ్బందీగా మలిచాడు. సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను కథలో లీనం చేస్తుంది. ల్యాగ్లు, డ్రామాలు లేకుండా సాగుతూ.. ప్రతి ఒక్కరికీ థ్రిల్‌ను పంచుతుంది.