Genelia | సినీ పరిశ్రమలో కొన్ని పాత్రలు కొన్ని నటుల కోసం ప్రత్యేకంగా పుట్టినట్టే అనిపిస్తాయి. అలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పాత్ర హాసిని..బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్‌ను ఓ దశలో శాసించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లైన జెనీలియా, మళ్లీ వెండితెరపైకి అడుగుపెడుతోంది.
13 ఏళ్ల విరామం తర్వాత ‘జూనియర్’తో రీఎంట్రీ ఇస్తుంది జెనీలియా. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల అవుతుండగా, ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఈ క్రమంలో పలు విషయాలు షేర్ చేస్తుంది. నేను రీఎంట్రీ ఇప్పుడు కాదు, 2022లోనే మా భర్త దర్శకత్వంలో వచ్చిన మజిలీ మరాఠీ రీమేక్‌లో నటించాను. సమంత పాత్రనే చేశాను. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ రీ ఎంట్రీ అనవచ్చు. సినిమాలు జీవితంలో ముఖ్యమైనవే, కానీ కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఈ 13 ఏళ్లలో నా భర్త, పిల్లలతో పూర్ణమైన జీవితం గడిపాను. ఇప్పుడు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారు కనుక మళ్లీ కెమెరా ముందుకి రావాలని అనిపించింది.
అంతేకాదు నా భర్త రితేష్ దేశ్ ముఖ్ గత 3 ఏళ్ల నుండి రీఎంట్రీ ఇవ్వాలంటూ తెగ టార్చర్ చేస్తున్నాడని, అందుకే 13 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాను అని సరదాగా పేర్కొంది జెనీలియా. తెలుగు ప్రేక్షకులు నన్ను ‘జెనీలియా’గా కాకుండా ‘హాసినిగా’ గుర్తుపెట్టుకున్నారు. బాయ్స్ లో హరిణి, ఢీ, రెడిలో పూజాగా నటించిన బొమ్మరిల్లులో హాసినే నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ పేరు వల్లే నన్ను ఇంకా గుర్తు పెట్టుకుంటున్నారు. మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించాలని ఉంది. పాత్ర చిన్నదైనా పర్లేదు, కానీ ప్రత్యేకంగా ఉండాలి. ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఉండాలి అని జెనీలియా పేర్కొంది. ఇక తన సహ నటులు పెద్ద స్టార్స్ కావడంతో కూడా సంతోషం వ్యక్తం చేసింది జెన్నీ.