‘వికటకవి’ వంటి పీరియాడిక్ బ్యాక్‌గ్రౌండ్ సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేయడం ఛాలెంజ్‌గా అనిపించిందని, ఈ సిరీస్ కోసం ఎంతో పరిశోధన చేశానని చెప్పింది గాయత్రి దేవి జోశ్యుల. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసిన ‘వికటకవి’ డిటెక్టివ్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నది. నరేష్ ఆగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి దేవి జోశ్యుల మాట్లాడుతూ ‘నేను చెన్నైలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. మైక్రోసాఫ్ట్‌వంటి ప్రముఖ కంపెనీలో పనిచేశా. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సినీరంగం వైపు అడుగులు వేశాను. ‘కుడిఎడమైతే’ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా నా ప్రయాణం మొదలైంది’ అని చెప్పింది.
‘వికటకవి’ సిరీస్ విశేషాల గురించి చెబుతూ ‘ఇది తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. దీనికోసం 1940లో హైదరాబాద్ ఎలా ఉందో రీసెర్చ్ చేసి తెలుసుకున్నా. ‘మాభూమి’ సినిమా చూడటం వల్ల అప్పటి ప్రజల వేషధారణ, సంస్కృతిపై ఓ అవగాహన వచ్చింది. మరింత రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి ఆర్టికల్స్ చదివాను. ఆ సమాచారం ఆధారంగా కాస్ట్యూమ్ డిజైన్స్ సిద్ధం చేశా’ అని పేర్కొంది. ‘వికటకవి’ టెక్నికల్‌గా తనకు మంచి ఎక్స్పీరియన్స్నిచ్చిందని, తదుపరి సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘మర్మయోగి’ వెబ్‌సిరీస్‌తో పాటు ‘మానసచోర’ అనే సినిమాకు పనిచేస్తున్నానని గాయత్రి దేవి జోశ్యుల తెలిపింది.