Mirai | ‘టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకుంటున్న ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే క్లైమాక్స్‌లో వచ్చే శ్రీరాముడి పాత్ర. సినిమాలో చివర్లో వచ్చే శ్రీరాముడి పాత్ర కథను మార్చేస్తుంది. రెండు నిమిషాలు ఉన్న ఆ పాత్రలో ముఖం కనిపించి కనిపించకుండా చూపించారు. దీంతో ఆ పాత్రను ఎవరు చేశారా అని నెటిజన్స్ తెగ ముచ్చటించుకుంటున్నారు. ఈ పాత్రలో నటించిన వ్యక్తి గురించి తెలిసుకోవాలని ప్రేక్షకులు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. మొదట్లో ఆ పాత్రలో ప్రభాస్ నటించాడనే రూమర్లు గుప్పుమన్నాయి. కానీ, ఇప్పుడు తెలిసిందేమిటంటే… ఆ పవర్ఫుల్ రోల్‌ను పోషించింది ఒక యువ నటుడు గౌరవ్ పోరా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చెందిన గౌరవ్ పోరా, మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశాక, నటనపై మక్కువతో ఢిల్లీలోని థియేటర్ గ్రూప్‌లో చేరాడు. అక్కడ ఐదేళ్ల పాటు హిందీలో అనేక నాటకాలు వేశాడు. తరువాత షార్ట్ ఫిల్మ్స్, హిందీ టీవీ సీరియల్స్, కమర్షియల్ యాడ్స్ ద్వారా నటుడిగా బాగా పరిణతి పొందాడు. ‘మిరాయ్’ సినిమాతో ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు లభించింది. ముఖం పూర్తిగా కనపడని పాత్రలోనూ తన హావభావాలతో ఆకట్టుకున్న గౌరవ్, ఇప్పుడు ఆ రెండు నిమిషాల శ్రీరాముడి రోల్‌తో నెట్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. అభిమానులు, సినిమా ప్రేమికులు గౌరవ్ గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే ఈ పాత్ర ద్వారా మంచి బజ్‌ను సొంతం చేసుకున్న గౌరవ్ పోరాకు, తెలుగు చిత్రసీమ నుంచే కాకుండా హిందీ పరిశ్రమ నుంచీ కూడా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ‘మిరాయ్’ తరహాలో డివోషనల్, మిస్టిక్ పాత్రలకే కాదు, కమర్షియల్ సినిమాల్లోనూ అతడిని చూడాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 12న విడుదలైన మిరాయ్ చిత్రం మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో తేజ సజ్జా, మంచు మనోజ్ తమ నటనతో ఎంతగానో మెప్పించారు.