TG Vishwa Prasad | టాలీవుడ్లోని అగ్ర నిర్మాతల్లో ఒకరైన టి.జి. విశ్వప్రసాద్ గత ఏడాది తన బ్యానర్ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయని తాజాగా వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను సాఫ్ట్వేర్ రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చానని, కష్టపడి సంపాదించిన డబ్బుతోనే సినిమాలు తీస్తున్నానని తెలిపారు. తన తండ్రి లేదా తాతల నుంచి తనకు ఎలాంటి వారసత్వ ఆస్తి రాలేదని స్పష్టం చేశారు.
గత ఏడాది తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని విశ్వప్రసాద్ అన్నారు. “పోయిన ఏడాది నేను నిర్మించిన మూడు సినిమాలు ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’, మరియు ‘స్వాగ్’ భారీ పరాజయాలు చవిచూశాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా నిర్మించిన ‘ఈగల్’ సినిమా వలన నేను భారీగా నష్టపోయాను. ఇక ‘మిస్టర్ బచ్చన్’ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఫలితం కూడా నిరాశ కలిగించింది. ఇక శ్రీవిష్ణు హీరోగా నిర్మించిన ‘స్వాగ్’ కూడా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఒకే ఏడాదిలో మూడు సినిమాల నష్టాలను భరించడం అంత తేలికైన విషయం కాదు” అని ఆయన వివరించారు. అయితే, ఈ నెల 12వ తేదీన తమ బ్యానర్ నుంచి విడుదల కానున్న ‘మిరాయ్’ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని విశ్వప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు..