సందీప్ మాధవ్, గాయత్రి ఆర్ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘గంధర్వ’. యాక్షన్ గ్రూప్ సమర్పణలో ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్కే ఫిలింస్ సహకారంతో నిర్మిస్తున్నారు. సబాని నిర్మాత. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ..‘నిత్యం యవ్వనంగా ఉండేలా యాంటీ ఏజింగ్ ఫార్ములా కోసం మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని ఒక యూనివర్సిటీలో ఈ ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథ ఇది. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్న సైనికుడిగా హీరో కనిపిస్తారు.
అదే సమయంలో జరిగిన అంతరిక్ష పరిశోధనల్లోనూ అతను పాల్గొంటాడు. సైనికుడికి అంతరిక్ష పరిశోధనలకు సంబంధం ఏంటనేది సినిమాలో చూడాలి. కొన్ని పరిస్థితుల వల్ల 75 ఏళ్ల వ్యక్తి, పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తే చూసే వాళ్లకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. గతంలో ఓ బేబీ లాంటి సినిమాలు ఇలాంటి కథలతో వచ్చాయి. అయితే అవి దేవుడి మహిమల వల్ల జరిగాయని చూపించారు. మేము సైంటిఫిక్‌గా, యాంటీ ఏజింగ్ మీద జరుగుతున్న ప్రయోగాలను చూపెడుతూ తెరకెక్కించాం. సైన్స్ విద్యార్థులు మా సినిమాను ఇష్టపడతారు. నేను అనుకున్న పాత్రకు సందీప్ మాధవ్ పర్ఫెక్ట్గా సరిపోయాడు’ అన్నారు.