‘గామా’ అవార్డ్స్ (గల్ఫ్ ఆకాడమీ మూవీ అవార్డ్స్) 5వ ఎడిషన్‌ను జూన్ 7న దుబాయ్ షార్జా ఎక్సో సెంటర్లో నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం దుబాయ్‌లో గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు సినీ, సంగీతకారులు పాల్గొన్నారు. ప్రముఖ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఎంపిక చేసిన కళాకారులకు గామా అవార్డ్స్‌ను బహూకరిస్తారు. ఈ సందర్భంగా గామా అవార్డ్స్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ ..గల్ఫ్‌లోని తెలుగు ప్రజలకు చక్కటి వినోదాన్ని అందించేలా ఐదవ ఎడిషన్‌కు ప్లాన్ చేశామని, సినీ ప్రముఖులు విశిష్ట అతిథులుగా హాజరవుతారని, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఈ అవార్డులను అందజేస్తామని తెలిపారు.