‘వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో అన్నీ గ్రే కేరక్టర్స్ ఉంటాయి. హీరోయిన్ మాత్రమే మంచి అమ్మాయి. కథ హైదరాబాద్ నేపథ్యంగా మొదలై కర్నూల్ నేపథ్యానికి షిఫ్ట్ అవుతుంది. స్క్రీన్‌ప్లే బేస్డ్గా సాగే సినిమా ఇది. మరో రెండేళ్ల తర్వాత ఈ కథను తెరపైకి తెచ్చినా కొత్తగానే ఉంటుంది.’ అంటున్నారు దర్శకుడు ఉదయ్‌శెట్టి. ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గం గం గణేశా’. ఆనంద్ దేవరకొండ కథానాయకుడు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక కథానాయికలు. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా రేపు శుక్రవారం విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు. ‘ ఇప్పటివరకూ బోయ్ నెక్ట్స్ డోర్ తరహా పాత్రలు చేసిన ఆనంద్ దేవరకొండ తొలిసారి ఈ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఫంకీగా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. అనుకున్నదానికంటే అద్భుతంగా నటించాడు కూడా.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ప్రత్యేకించి ప్రేమకథ అంటూ ఉండదు. ప్రయాణంలో భాగంగా ఇద్దరు కలుస్తారు. వాళ్లవి కూడా కీ రోల్సే. ఇక వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకే హైలైట్.’ అని తెలిపారు. ఇంకా చెబుతూ ‘భయం, అత్యాశ, కుట్ర ఇవి అందరిలో ఉన్నా.. కొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఆ లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితులవైపు నడిపించాయి? అనే ప్రశ్నకు సమాధానమే ‘గం గం గణేశా’.’ అని చెప్పారు ఉదయ్ శెట్టి.