పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రజనీ కొర్రపాటి నిర్మాత. శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి అగ్ర దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిర్మాత సాయిగారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో చిన్న సినిమా తీస్తున్నాడనుకున్నా.
కానీ క్రమంగా పెద్ద సినిమాగా మారింది. అద్భుతమైన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కుదిరారు. ఈ రోజు సినిమా వెయ్యి స్క్రీన్స్‌లో విడుదలవుతుందంటే ఆడియెన్స్‌కు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందనే విషయం అర్థమవుతున్నది. ఇన్ని సంవత్సరాలైనా జెనీలియా అంతే అందం, ఆకర్షణతో కనిపించడం గ్రేట్. ఫ్యామిలీ, యూత్‌ఫుల్ కథతో ‘జూనియర్’ అందరిని మెప్పిస్తాడనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో జెనీలియా, దేవిశ్రీప్రసాద్, శ్రీలీల, నిర్మాత సాయి కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు.