‘గద్దర్ అవార్డులకు సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. బి.నరసింగరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశాం. గతంలో నంది అవార్డుల స్థానే ఇక నుంచి గద్దర్ అవార్డులు కొనసాగుతాయి’ అని టీఎఫ్‌డీసీ ఛైర్మన్, అగ్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రదానం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకూ విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాదీ ఓ ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. 2024కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. వివిధ కేటగిరీలో అవార్డులను అందిస్తాం. గత నంది అవార్డులకు సంబంధించిన విధి విధానాలే దాదాపుగా కొనసాగుతాయి. తెలంగాణకు వన్నె తెచ్చిన ప్రఖ్యాత నటులు పైడి జైరాజ్, కాంతారావుల పేరి ట గౌరవ పురస్కారాలు అందించను న్నాం.
తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉర్దూ సినిమాకు కూడా అవార్డులు ఇవ్వనున్నాం’ అని తెలిపారు దిల్‌రాజు. ఓ వారం రోజుల్లో గద్దర్ అవార్డులకు సం బంధించిన జ్యూరీని ఏర్పాటు చేయనున్నామని, ఈ అవార్డుల విధివిధానాలకు సంబంధించిన పూర్తి వివరాలు జ్యూరీ తెలియజేస్తుందని, ఏప్రిల్‌లో గద్దర్ అవార్డుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని దిల్‌రాజు పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు బి.నరసింగరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డు కమిటీలో దిల్‌రాజు ఉపాధ్యక్షుడిగా, కె.రాఘవేంద్రరావు, అందెశ్రీ, తమ్మా రెడ్డి భరద్వాజ్, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరణి, డి.సురేశ్‌బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణిశ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్‌శంకర్, వేణు యల్దండి సలహాదారులుగా ఉన్నారు. అవార్డులను వివాదం చేయొద్దు ‘గద్దర్’ అవార్డులను కొందరు సినిమావాళ్లు వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.. వారికి మీరిచ్చే సమాధానమేంటి?’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘అది అవాస్తవం. ఎవరూ వ్యతిరేకించడంలేదు. ప్రభుత్వం అందించే అవార్డులను స్వీకరించడం సినిమావాళ్లందరం గౌరవంగా భావిస్తాం. అనవసరంగా సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు’ అని దిల్‌రాజు కోరారు.