రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలవడంతోపాటు పలు వ్యక్తిగత పురస్కారాలను కూడా గెలుచుకున్న రూరల్ తెలంగాణ ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని అభినందిస్తూ హైదరాబాద్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేషన్ గురువారం హైదరాబాద్లో మీట్ ది ప్రెస్ని నిర్వహించింది. ‘నేను చూసిన జీవితాల ఆధారంగా రాసుకున్న ఈ కథ నన్ను ఇంత దూరం తీసుకొస్తుందని అనుకోలేదు. సినిమాకు డబ్బులొస్తే చాలు అనుకున్నా.
ఇన్ని అవార్డులు కూడా వస్తాయని ఊహించలేదు. ముఖ్యంగా క్రిటిక్స్ నుంచి అభినందనలు వస్తే ఆ కిక్కే వేరు’ అని దర్శకుడు సాయిలు కంపాటి అన్నారు. ప్రెస్మీట్ పెట్టి మరీ ఈ సినిమాను ప్రశంసిస్తున్న జర్నలిస్ట్ మిత్రులకు ధన్యవాదాలనీ, ఈ సినిమాకు లభించిన అవార్డులకంటే, మీ అభినందనలే విలువైనవనీ చిత్ర నిర్మాత వేణు ఊడుగుల అన్నారు. ఇంకా చిత్ర సమర్పకులు నాగేశ్వరరావు పూజారి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాహుల్ మోపిదేవిలతోపాటు నటులు శివాజీరాజా, చైతూ జొన్నలగడ్డ, నటి అనితా చౌదరి, సీనియర్ పాత్రికేయులు ప్రభు, బత్తుల జేవీ ప్రసాద్, సురేశ్ కొండేటి కూడా పాల్గొన్నారు.