హైదరాబాద్ జూన్ 14 (నమస్తేతెలంగాణ): గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్ఞాపికలకు గద్దర్ చిత్రంతో కూడిన డిజిటల్ స్టిక్కర్‌ను అతికించారు..శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’ దినపత్రికలో గద్దర్‌కు తీవ్ర అవమానం పేరిట ప్రచురితమైన కథనం, ప్రజావ్యతిరేకత భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. అఘమేఘాలపై గద్దర్ డిజిటల్ చిత్రాలను మెమొంటోలకు అతికించిందని తెలంగాణ కళాభిమానులు, సినీ ప్రముఖులు చెబుతున్నారు. అయితే అవసరమనుకున్నవారు ఈ స్టిక్కర్‌ను ఉంచుకునేలా అవసరం లేదనుకునేవారు తొలగించేలా వెసులుబాటు కల్పించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కారు వైఖరిని తెలంగాణకు చెందిన సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, ప్రతిపక్ష నాయకులు, కళాకారులు, రచయితలు తప్పుబడుతున్నారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన సినీ పెద్దల లాబీయింగ్‌కు తలొగ్గి బి. నర్సింగరావు కమిటీ సూచనలకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శలు గుప్పిస్తున్నారు. గద్దర్‌పై ప్రేమతో కాకుండా కేవలం ప్రజల్లో పలుచనవుతామనే భయంతోనే ప్రభుత్వం ఆయన చిత్రాన్ని జ్ఞాపికలపై ఏర్పాటు చేసి పొరపాటును సరిదిద్దిందని చెబుతున్నారు.