Oscars In Youtube | సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ (Oscars) వేడుకలకు సంబంధించి ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది. ఇప్పటివరకు టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారమవుతున్న ఈ వేడుకలు 2029 నుంచి నేరుగా యూట్యూబ్ (YouTube) వేదికగా ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. దీనికి సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS), గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్‌తో మల్టీ-ఇయర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2029 నుంచి 2033 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండబోతుంది.
1976 నుంచి దాదాపు 50 ఏళ్లుగా ఆస్కార్ వేడుకల ప్రసార హక్కులు అమెరికాకు చెందిన ABC (Disney) నెట్వర్క్ వద్ద ఉన్నాయి. 2028లో జరగబోయే 100వ ఆస్కార్ వేడుకతో ఈ టీవీ ఒప్పందం ముగియనుంది. దీంతో ఆస్కార్ వేడుకల స్ట్రీమింగ్ హక్కులను యూట్యూబ్ దక్కించుకున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఆస్కార్ వేడుకలు యూట్యూబ్‌లోకి రావడం వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. అయితే కేవలం ప్రధాన వేడుక మాత్రమే కాకుండా, రెడ్ కార్పెట్ ఈవెంట్, తెర వెనుక విశేషాలు (Behind-the-scenes), నామినేషన్ల ప్రకటన వంటివన్నీ ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉంచబోతుంది యూట్యూబ్. గ్లోబల్ ఆడియన్స్ కోసం వివిధ భాషల్లో ఆడియో ట్రాక్‌లు, సబ్‌టైటిల్స్ (Closed Captioning) అందించాలని యూట్యూబ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం 98వ ఆస్కార్ వేడుకలు 2026 మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్నాయి.
Film’s biggest night is headed to @YouTube, starting 2029. pic.twitter.com/5ckm1JyBC7
— The Academy (@TheAcademy) December 17, 2025