Freedom At Midnight | భారత స్వాతంత్ర్య పోరాటం, దేశ విభజన నాటి చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ (Freedom At Midnight) తన రెండో సీజన్‌తో రాబోతుంది. నిఖిల్ అద్వానీ దర్వకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ రచయితలు డొమినిక్ లాపియర్, లారీ కాలిన్స్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ ఆధారంగా రాబోతుంది. తాజాగా ఈ దీనికి సంబంధించిన ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ తేదీని చిత్రబృందం విడుదల చేసింది. రెండో సీజన్‌ని జనవరి 09 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్ వేదికగా(Freedom At Midnight 2 on Sonyliv) స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
రెండో సీజన్ ట్రైలర్ చూస్తుంటే.. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలను ఈ సిరీస్ ప్రస్తావించనుంది. స్వాతంత్ర్యానంతరం భారత్ ఎదుర్కొన్న పెను సవాళ్లు, దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడానికి జరిగిన భారీ పోరాటంపై దృష్టి సారించింది. ముఖ్యంగా, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానాయకులు అప్పటికింకా భారతదేశంలో భాగంగా లేని రాచరిక సంస్థానాలను (Princely States) ఏ విధంగా విలీనం చేశారు. అలాగే కీలకమైన కలకత్తాను పాకిస్థాన్‌లో కలపకుండా ఎలా అడ్డుకున్నారు. చారిత్రక నగరం అయిన లాహోర్‌ని ఎలా వదులుకున్నారు అనేది ఇందులో ఆసక్తికరంగా సాగింది. మొదటి సీజన్ భారీ విజయం అందుకున్న నేపథ్యంలో దేశ నిర్మాణంలో మన నాయకులు పడిన శ్రమను తెలుసుకోవాలనుకునే చరిత్ర అభిమానుల్లో సీజన్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.