Fish Venkat | తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో “తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో గుర్తింపు పొందిన వెంకట్, ఆ తరువాత వరుసగా అనేక టాప్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించారు. వెంకట్ గత 9 నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల పరిస్థితి మరింత విషమించడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం ఎదుటి వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆసుపత్రి ఖర్చులు భరించలేకపోతున్న ఆయన కుటుంబం సహాయం చేయాలంటూ దాతలను కోరుతూ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకట్ భార్య మాట్లాడుతూ, “ప్రస్తుతం పరిచయస్తులు ఎవరూ ఆయనను చూడటానికి కూడా రావడం లేదు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం మద్యం వల్ల షుగర్, కాలు ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో వెంకట్‌కు పలువురు సినీ ప్రముఖులు, దాతల సాయం చేయడంతో ఆపరేషన్ జరిగి ప్రాణాలు దక్కాయి. కానీ ఆపరేషన్ తరువాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా కష్టాల్లో పడ్డారు. తిరిగి మద్యం, ధూమపానం అలవాట్లు వదలలేకపోవడంతో ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందని ఆయన భార్య వాపోయారు.
తన భర్త స్నేహితులే ఇంటికి వచ్చి మళ్లీ అలవాటు చేశారని.. కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవ్వరూ చూడటానికి కూడా రావడం లేదని వాపోయారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ కుటుంబం.. సినీ సంఘాలు, అభిమానులు, దాతలు, ప్రభుత్వాధికారులు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నారు. ఒక సమయంలో ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా వెలిగిన వెంకట్ పరిస్థితి ఇలా మారడం దిగ్భ్రాంతికి గురిచేసింది. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.