Fish Venkat | తెలుగు సినిమాల్లో కమెడియన్‌గాను, విలన్‌గాను నటించి మెప్పించాడు ఫిష్ వెంకట్ . మెయిన్ విలన్ పక్కన ఉంటూ తనదైన తెలంగాణ పంచ్‌లతో అలరించేవాడు.అయితే ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమి బాగుండడం లేదు. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వెంకట్ గతంలో డయాలసిస్ తీసుకున్నారు. అప్పట్లో ఆరోగ్యం కొంత మెరుగైనట్లే కనిపించినా, ఇటీవల మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో కూడా లేరు అన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. వెంకట్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. చికిత్స ఖర్చులు భరించలేక దాతల సహాయం కోరుతోంది. ఆయన భార్య, కూతురు మీడియా ద్వారా “దయచేసి మా ఫ్యామిలీని ఆదుకోండి” అంటూ ప్రజలకు, సినీ ప్రముఖులకు వేడుకుంటున్నారు.గతంలో గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకున్న వెంకట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆరోగ్యం విషమించడంతో సాయం అవసరమైంది.
వైద్యుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం వెంకట్ డయాలసిస్‌పై ఉన్నారు, కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని చెబుతున్నారు. ఇది ఖరీదైన ప్రక్రియ కావడంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఫిష్ వెంకట్ పరిస్థితిని చూసి అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రముఖ హీరోలు, అలాగే ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) స్పందించి ఆయనకు ఆర్థికంగా, మానసికంగా అండగా నిలవాలని కోరుతున్నారు. ఫిష్ వెంకట్ “ఆది” చిత్రంలో చెప్పిన “తొడ గొట్టు” డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటుంది. పవన్ కల్యాణ్ నటించిన “గబ్బర్ సింగ్” లోనూ తన కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు ఫిష్ వెంకట్.