Fish Venkat | తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఫిష్ వెంకట్‌కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించేవారు. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని సిఫార్సు చేసినా, అవసరమైన ఆర్థిక సహాయం అందకపోవడం, సరైన దాతలు దొరకకపోవడం విషాదకరంగా మారింది. అంతేకాదు, రక్తపోటు (బీపీ), షుగర్ అదుపులో లేకపోవడంతో ఇతర అవయవాల పనితీరు దెబ్బతిని చివరికి చికిత్సలకు శరీరం స్పందించలేదు. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు.
ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. 1971 ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించిన ఆయన, చిన్నతనంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్మే వ్యాపారం చేసేవారు. అందుకే అభిమానులు, సహచరులు ఆయనను “ఫిష్ వెంకట్” అని పిలిచేవారు.మూడవ తరగతి వరకే చదివిన వెంకట్‌కు సినిమాలపై అపారమైన ఆసక్తి ఉండేది. దివంగత నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వెంకట్‌ను దర్శకుడు వి.వి. వినాయక్ సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. వెంకట్ వినాయక్‌ను తన గురువుగా భావించేవారు.
2002లో విడుదలైన ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో “ఒక్కసారి తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో ఫిష్ వెంకట్ ప్రజల మదిలో నిలిచిపోయారు. ఆ తర్వాత 100కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కొన్ని చోట్ల విలన్ పాత్రలతో కూడా మెప్పించారు.తెలంగాణ యాస, విలక్షణమైన హావభావాలు, కామెడీ టైమింగ్ ఇవన్నీ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్న పాత్రల్లో కనిపించినా, ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఫిష్ వెంకట్ మృతిపై సినీ ప్రముఖులు, సహనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు సినీ పరిశ్రమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.