పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవిత విశేషాలతో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌లో జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహిస్తుండగా.. ‘గ్లాడియేటర్’, ‘ది ఏవియేటర్’ చిత్రాలను రాసిన జాన్ లోగన్ స్క్రిప్ట్ రాశారు. మైఖేల్ జాక్సన్ ఎస్టేట్‌కు సహ నిర్వాహకులుగా ఉన్న జాన్ బ్రాంకా, జాన్ మెక్క్లెయిన్లతో కలిసి గ్రాహం కింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
2025, ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను లయన్స్ గేట్ ఫిల్మ్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో బుధవారం షేర్ చేసింది. ఈ ఫొటోలో జాఫర్ జాక్సన్ అచ్చం తన మేనమామ 1992-93ల్లో కలిగి ఉన్న రూపంలో ఆకట్టుకున్నారు. మైఖేల్ సంతకం ముద్రించి ఉన్న తెల్లటి చొక్కాను ధరించి మైక్ చేతపట్టుకొని కనిపించాడు. మైఖేల్ కెరీర్లో సింహభాగం ఫొటోలను తీసిన కెవిన్ మజూర్ ఈ ఫస్ట్‌లుక్‌ను క్లిక్‌మనిపించారు. మైఖేల్ జాక్సన్ జీవితాన్ని నిజాయితీగా చిత్రీకరించడమే తమ లక్ష్యమని చిత్ర నిర్మాత గ్రాహం కింగ్ పేర్కొన్నారు.